బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో రజిత పతకం సాధించిన సమీరా
వినుకొండ:- వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో ఉంటూ రాధా డిగ్రీ కాలేజీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆకుమల్ల సమీరా సౌత్ జోన్ స్థాయిలో ప్రతిభ చాటింది. తమిళనాడు రాష్ట్రంలోని టెంకాసి పట్టణంలో మార్చి 28, 29 తేదీలలో జరిగిన 44వ మహిళల సీనియర్ సౌత్ జోన్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొని రజిత పతకం సాధించింది.ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ రత్నకుమారి వెల్లడించారు. శావల్యాపురం మండలం శానంపూడి గ్రామానికి చెందిన సమీరా, వినుకొండలోని ఎన్ఎస్పీ కాలనీ హై స్కూల్ మైదానంలో ప్రతిరోజూ కఠినంగా సాధన చేస్తూ ఈ స్థాయికి చేరుకుందని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారి కె. శ్రీనివాసులు సమీరా విజయాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు శాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.అలాగే వినుకొండ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ షేక్ షకీలా దస్తగిరి సమీరాను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం తమ వంతుగా అందిస్తామని తెలిపారు.
సమీరాకు చిన్ననాటి నుంచే శిక్షణ అందించిన ఎన్ఎస్పీ హై స్కూల్ పీడీ ఆర్. రాధాకృష్ణమూర్తి, ప్రధానోపాధ్యాయులు సిహెచ్. వీరప్పయ్యలు ఆమె కృషిని కొనియాడారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ వై. శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ ఈ. శివశంకర్, జాయింట్ సెక్రటరీ జోన నాయక్, వైస్ ప్రెసిడెంట్ మేడిశెట్టి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.
రాధా డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ రాధా, వినుకొండ మండల విద్యాశాఖాధికారి సయ్యద్ జఫ్రుల్లా కూడా సమీరా విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సమీరా కఠిన సాధనతో సౌత్ జోన్ స్థాయిలో రజిత పతకం సాధించి వినుకొండ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

💬 Leave a Comment