అయ్యా నేను బాగానే ఉన్నాను – నాదెండ్ల భాస్కరరావు |localnewstelugu | Hyderabad
ఇటీవల కాలంలో కొన్ని టీవీ ఛానెల్లు నిర్ధారణ లేకుండా వార్తలను ప్రసారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. అసలు నిజం ఏమిటో తెలుసుకోకుండా, పుకార్లను వార్తలుగా మార్చి ప్రజలకు అందించడం ప్రమాదకర ధోరణిగా మారింది. ‘బ్రేకింగ్ న్యూస్’, ‘ఫస్ట్ ఆన్’, ‘ఎక్స్‌క్లూజివ్’ పేర్లతో ముందంజలో ఉండాలనే పోటీలో, పలుమార్లు ప్రముఖులను ముందుగానే ‘చంపేసిన’ సందర్భాలు కూడా ఉన్నాయి.అదే విధంగా, గత రెండు రోజులుగా దాదాపు అన్ని ఛానెల్లు నాదెండ్ల భాస్కరరావు గారి ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు ప్రసారం చేశాయి. కానీ వాస్తవానికి ఆయన క్షేమంగా, ఆరోగ్యంగా ఇంట్లోనే ఉన్నారు. ఈ తప్పుడు వార్తలు ఎలా పుట్టాయి, ఎలా వ్యాపించాయో అనేది పెద్ద ప్రశ్నగా మారింది.ఈ వదంతులపై ఆశ్చర్యానికి గురైన భాస్కరరావు స్వయంగా తనకు తెలిసిన మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి, తాను బాగానే ఉన్నానని తెలిపారు. మరోవైపు, ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రెస్ నోట్ విడుదల చేసి, తన తండ్రి ఆరోగ్యంగా ఉన్నారని, ఆసుపత్రిలో లేరని స్పష్టం చేయాల్సి వచ్చింది. నిజమైన బ్రేకింగ్ న్యూస్‌లలో పోటీ పడటం సహజమే. కానీ ఇలాంటి అనారోగ్యానికి సంబంధించిన విషయాల్లో నిర్ధారణ లేకుండా ముందుగానే వార్తలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇది జర్నలిజం విలువలకు విరుద్ధం. కొంత సమయం తీసుకుని, నిజానిజాలు తెలుసుకుని వార్తలు ప్రసారం చేస్తే ఏమి నష్టం లేదు. పుకార్లతో వార్తలు తయారు చేయడం వల్ల కలిగేది గందరగోళమే. ప్రస్తుత జర్నలిజంలో విలువలు తగ్గిపోతున్నాయనే భావన ఉన్నప్పటికీ, కనీసం మానవత్వం మాత్రం నిలబెట్టాలని కోరుకోవాలి.

💬 Leave a Comment