ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల అప్రమత్తంగా ఉండాలి – డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్
రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి సూచించారు. ఈ మేరకు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా ఆయన మాట్లాడుతూ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోవచ్చని, దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో అత్యవసరమైతే తప్ప వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలా ఆహారం తగ్గించి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు కాటన్ దుస్తులు ధరించి గొడుగు, టోపీ లేదా కర్చీఫ్ వంటివి వెంట తీసుకెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా రైతులు, కూలీలు ఎండలో పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఎవరైనా వడదెబ్బకు గురైనట్లు అనిపిస్తే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు. వృత్తిరీత్యా వైద్య పట్టభద్రుడైన ఆయన ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ సూచనలు చేశారు.

💬 Leave a Comment